కొమరయ్య పరమ పిసినారి. ఆయనకు ఏడేళ్ళ మనమరాలు ఉంది; పేరు గీత. ఒకనాడు ఒకడు అద్దాల పెట్టెలో తినుబండారాలు అమ్ముతూ కొమరయ్య ఇంటి ముందుకు వచ్చాడు. వాటిని చూడగానే గీతకు తినాలని కోరిక కలిగి,"తాతయ్యా, మిఠాయి కొనుక్కుంటాను, డబ్బు ఇవ్వు" అని అడిగింది కొమరయ్యను.
డబ్బు అనే మాట వినగానే కొమరయ్య ఉలిక్కిపడ్డాడు . ఆ తరవాత తేరుకుని, "సరే, గీతా నేను ఒక ప్రశ్న వేస్తాను. సరిగ్గా సమాధానం చెప్పావంటే నీకు డబ్బులు ఇస్తాను" అన్నాడు ."అలాగే తాతయ్యా, అడుగు" అన్నది గీత.
కొమరయ్య రొంటిన దోపుకున్న ఒక చిల్లర నాణెం, ఒక బంగారు నాణెం తీసి గీతకు చూపించి, "ఈ రెండింటిలో ఏది పెద్దది?" అని ప్రశ్నించాడు.
పరిమాణంలో చిల్లు నాణెం పెద్దదిగా ఉండటంతో, గీత దానికేసి చూపుతూ, "ఇది పెద్దది" అన్నది. "కాదు బంగారు నాణెం పెద్దది" అంటూ కొమరయ్య, అది ఎలా పెద్దదో వివరించి చెప్పాడు సంతోషంగా.
పరిమాణంలో చిల్లు నాణెం పెద్దదిగా ఉండటంతో, గీత దానికేసి చూపుతూ, "ఇది పెద్దది" అన్నది. "కాదు బంగారు నాణెం పెద్దది" అంటూ కొమరయ్య, అది ఎలా పెద్దదో వివరించి చెప్పాడు సంతోషంగా.
"తాతయ్యా నేను ఓడిపోయాను. ఇప్పుడు నేనొక ప్రశ్న వేస్తాను. నువ్వు సమాధానం చెబుతావా?" అని అడిగింది గీత.
చిన్నపిల్ల అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పలేనా అనుకుని, " సరే, అడుగు" అన్నాడు కొమరయ్య.
" అయితే, ఒక షరతు" అన్నది గీత. "ఏమిటి?" అని అడిగాడు కొమరయ్య.
"తాతయ్యా, నేను ఓడిపోతే ఇంకెప్పుడూ నిన్ను డబ్బులు అడగను. నువ్వు ఓడిపోతే, చిల్లు నాణెంతో పాటు బంగారు నాణెం కూడా నాకు ఇవ్వాలి, సరేనా?" అన్నది గీత. కొమరయ్య సంతోషంగా ఒప్పుకున్నాడు.
"తాతయ్యా ఒంటె పెద్దదా? ఒంటెపిల్ల పెద్దదా?" అని ప్రశ్నించింది గీత. "ఇందులో సందేహమెందుకు, ఒంటె పెద్దది" అన్నాడు కొమరయ్య.
"పప్పులో కాలు వేశావు తాతయ్యా! ఒంటెపిల్ల వయసెంతో నువ్వు అడగలేదు ఒంటెపిల్ల కూడా పెద్దదే. అది పుట్టి పదేళ్ళు అవుతుంది" అన్నది గీత.
కొమరయ్య మనమరాలి తెలివికి మురిసిపోతూ, ఆమె అడిగినట్టు రెండు నాణాలూ ఆమెకు ఇచ్చాడు.
----------------------------------------------------------------------------------------------------------------
రచన: టి.రాజేంద్ర.
0 comments:
Post a Comment